- ప్రేక్షకులకు అందుబాటులోకి ఉల్కా టీవీ
ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్), ప్రైవేటురంగ సంస్థ. సిటీ ఆన్‌లైన్ మీడియా సంయుక్తంగా టెలివిజన్ రంగంలో అడుగుపెట్టాయి. ఈ రెండు సంస్థలు కలిసి ఉల్కా టీవీ పేరుతో డిజిటల్ టెలివిజన్ చానళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ టీవీని బీఎస్‌ఎన్‌ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాల్ విజయవాడలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా మొత్తం 27 లక్షల మంది తమ ఫైబర్ బ్రాడ్‌బ్రాండ్‌ను వినియోగిస్తున్నారన్నారు. వారితోపాటు కొత్తగా చేరే వినియోగదారులకు 10వేలకు మించిన చానళ్లను ప్రస్తుతం ఉన్న బ్రాడ్‌బ్రాండ్ కనెక్షన్ ద్వారా పొందవచ్చని చెప్పారు. ఉల్కా టీవీకి ఎలాంటి సెట్‌టాప్ బాక్సులు, యాంటీనాలు అవసరం లేదని.. వైఫై, ల్యాన్ ద్వారా టీవీ సేవలను పొందవచ్చని వివరించారు. కీబోర్డు, కెమెరాలను అమర్చుకుని ఐపీటీవీ ద్వారా వీడియో కాన్ఫెరెన్స్‌లు, విద్య, వైద్య సంబంధిత సేవలు పొందవచ్చని తెలిపారు. ఉల్కా టీవీలో మొత్తం ఐదు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని వెల్లడిరచారు. ట్రాయ్ నిబంధనల ప్రకారం 350 ఉచిత చానళ్లతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీ ఎయిర్ ప్యాక్ రూ.130, ఎస్జీ బేసిక్ 350 ఉచిత చానళ్లతో పాటు 32 చెల్లింపు చానళ్లను రూ.229లకు ప్యాకేజీ అందుబాటులో ఉందన్నారు. ఎస్టీ బొనాంజా కింద 350 ఉచిత చానళ్లతోపాటు 52 చెల్లింపు చానళ్లను రూ.559లకు వినియోగదారులు పొందవచ్చన్నారు. హెచ్ బేసిక్‌లో రూ.279లకు 30 చెల్లింపు చానళ్లతోపాటు, 350 ఉచిత చానళ్లను పొందవచ్చన్నారు. హెచ్‌డీ బొనాంజా పేరుతో 53 చెల్లింపు చానళ్లతోపాటు 350 ఉచిత చానళ్లను రూ.329లకు పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో పీ.గురుప్రసాద్, ఎండ్ (జనరల్), విజయవాడ ఈ సౌకర్యాన్ని ఎంచుకొని తొలి వినియోగదారుడిగా నమోదయ్యారు. టెలికం సలహా కమిటీ ఉమ్మడి గుంటూరు జిల్లా సభ్యులు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ ఈ నూతన సేవలు ప్రారంభంతో ఉన్నతమైన నాణ్యతతో జికే టివి ప్రసారాలు దేశం లోనే ఒక నూతన శకానికి నాంది పలికి నట్లు అయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ సీఎఫ్ జీఎం వివేక్ దుయా, బీఎన్‌ఎన్‌ఎల్ ఏపీ సర్కిల్ సీజీఎం సురేష్ కృష్ణ, సిటీ ఆన్‌లైన్ మీడియా ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.