రష్యాలోని పర్మ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి గోవాకు బయలుదేరి విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో అజుర్ ఎయిర్ సంస్థకు చెందిన ఆ విమానాన్ని అత్యవసరంగా ఉజ్బెకిస్తాన్‌కు డైవర్ట్ చేశారు.
ఆ విమానంలో 238 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో ఇద్దరు శిశువులు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం సిబ్బంది ఏడు మంది ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఆ చార్టెడ్ ఫ్లయిట్ గోవాలోని డబోలిన్ విమానాశ్రయంలో తెల్లవారుజామున 4.15 నిమిషాలకు ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ భారతీయ వైమానిక క్షేత్రంలోకి ప్రవేశించకముందే దాన్ని ఉజ్బెకిస్తాన్‌కు దారి మళ్లించారు.విమానంలో బాంబు ఉన్నట్లు రాత్రి 12.30 నిమిషాలకు గోవా ఎయిర్‌పోర్ట్‌కు మెయిల్ వచ్చింది. దీంతో ఆ విమానాన్ని దారి మళ్లించే నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల క్రితం మాస్కో నుంచి గోవాకు వస్తున్న ఓ విమానాన్ని అత్యవసరంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే. బాంబు బెదిరింపు రావడం వల్లే ఆ విమానాన్ని దించారు.