- చిరుధాన్యాల వినియోగం పెరగాలి-డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
- మిల్లెట్స్ వినియోగంపై అవగాహనా ర్యాలీ
మన ఆరోగ్యం కోసం ఆహారంలో చిరుధాన్యాల వినియోగాన్నిపెంచాలని, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి కోరారు. చిరుధాన్యాల వినియోగాన్ని పెంచి, తద్వారా పోషకాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. ఈ నెల 21,22 తేదీల్లో జరగనున్న చిరుధాన్యాల మహోత్సవంలో భాగంగా, ప్రజల్లో చిరుధాన్యాల వినియోగం పట్ల అవగాహన పెంచేందుకు, ఎపిఎఫ్‌పిఎస్ ఆధ్వర్యంలో, పట్టణంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్ నుంచి ఆనందగజపతి ఆడిటోరియం వరకు 2 కిలోమీటర్ల రన్‌ను శుక్రవారం నిర్వహించారు. ఈ రన్‌ను కాంప్లెక్స్ వద్ద కోలగట్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యుటీ స్పీకర్ వీరభద్రస్వామి మాట్లాడుతూ, చిరుధాన్యాలతో కూడిన ఆహార పదార్థాల వినియోగం, దాని ద్వారా కలిగే ప్రయోజనాలు, పిల్లలలో రక్తహీనత తగ్గించడమే లక్ష్యంగా మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. గత కొన్నేళ్లుగా చిరుధాన్యాల వాడకం తగ్గిందని, దీనివల్ల అనారోగ్యం బారిన పడుతున్నవారి సంఖ్య పెరిగిందని అభిప్రాయపడ్డారు. చిరుధాన్యాల వాడకాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ తదితర కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ఒకవైపు పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు మంచి పోషకాహారాన్ని అందించడమే కాకుండా, మరోవైపు చిరుధాన్యాల ఆవశ్యకతను రైతులకు తెలియజేయాలన్న లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. చిరుధాన్యాలు, వాటి ద్వారా చేకూరే ప్రయోజనాలతో పాటు సాగుకు అనువైన భూములు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతులకు కలిగే లాభాలు వంటి అంశాలపట్ల రైతులకు, ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కృత నిశ్చయంతో ఉందని ఆయన కోలగట్ల స్పష్టం చేశారు. జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రజల్లో చిరుధాన్యాల వాడకాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహోత్సవాలకు శ్రీకారం చుట్టాయని చెప్పారు. ప్రజలు ఆరోగ్యకరంగా ఉండాలంటే, చిరుధాన్యాలను తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు. చిరుధాన్యాలను ఆధునిక పద్దతుల్లో సాగుచేయడం, వాటిద్వారా కలిగే లాభాలు, సాగుచేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మేలైన వంగడాలను అందజేయడం తదితర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే చిరుధాన్యాల ద్వారా కలిగే ప్రయోజనాలు, వాడే విధానం, లభించే పోషకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సి ఉందని ఛైర్‌పర్సన్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, డిఆర్‌డిఏ పిడి ఎ.కల్యాణ చక్రవర్తి, మున్సిపల్ కమిషనర్ ఆర్.శ్రీరాములనాయుడు, జిల్లా వ్యవసాయాధికారి త్రినాధస్వామి, ఉద్యాన శాఖాధికారి జమదగ్ని, మెప్మా పిడి సుధాకరరావు, సెట్విజ్ సిఈఓ రామ్‌గోపాల్, ఎపిఎఫ్‌పిఎస్ పిడి సుభాష్, వివిధ శాఖల అధికారులు, డిఆర్‌డిఏ సిబ్బంది పాల్గొన్నారు.