ఉద్యోగులంటే ప్రభుత్వంలో భాగం, వారి సమస్యలు పరిష్కరిస్తాం: సజ్జల
ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగమని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. టీడీపీ హయాంలో ఉద్యోగుల యూనియన్‌లను రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను ఎపుడూ అందుబాటులో ఉంటానన్నారు. అందరి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యలున్నాయని.. ఖర్చు పెట్టే ప్రతీ రూపాయి సరైన మార్గంలోనే వెళ్తున్నాయని సజ్జల చెప్పారు. అధికారం అనేది ప్రజాసేవగా ముఖ్యమంత్రి భావిస్తున్నారని సజ్జల చెప్పారు.
ఎల్లో మీడియాలో చంద్రబాబు అసత్య ప్రచారం
మీడియా మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ తన గుప్పిట్లో పెట్టుకుని అబద్దాలను ప్రచారం చేస్తోందని సజ్జస ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మూడున్నరేళ్లల్లో పరిపాలన అంటే ఇలా ఉండాలని జగన్ రోల్ మోడల్‌గా నిలిచారని కొనియాడారు. ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అనలేదా అని సజ్జల ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ డీఎన్ఏలోనే ఎస్టీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని స్పష్టం చేశారు. విద్య, వైద్యంలో ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగేలా వైఎస్సార్ హయాంలో అడుగులు పడ్డాయని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజ్వేషన్లు అమలు చేశారని స్పష్టం చేశారు. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఇంతకంటే ఎవరూ తక్కువ రిజర్వేషన్లు ఇవ్వలేరని సజ్జల అభిప్రాయపడ్డారు.
తెలుగుపై కోపంతో ఇంగ్లీష్ మీడియం పెట్టలేదు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుపై మమకారం ఉందన్నారు సజ్జల. పులివెందులబిడ్డ అచ్చ తెలుగులో మాట్లాడగలరని చెప్పారు. ఇంగ్లీష్‌పై మోజుతో తెలుగుపై కోపంతో ఇంగ్లీష్ మీడియం పెట్టలేదని..అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలని ఇంగ్లీష్‌ను ప్రోత్సహించారన్నారు. టాప్ వంద యూనివర్సిటీలలో పేద విద్యార్ధులు సీటు తెచ్చుకుంటే ఎన్ని కోట్లైనా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. గత ప్రభుత్వం విదేశీ విద్య పేరుతో అరకొరగానే నిధులు ఇచ్చిందని సజ్జల ఆరోపించారు. బలహీనవర్గాల కుటుంబాల్లో మార్పు తీసుకురావడానికే విద్యకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.