విద్యుత్తు ఛార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ 19నుంచి మూడ్రోజుల పాటు వర్చువల్ పద్దతిలో కార్యక్రమం-ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి :
విద్యుత్తు ఛార్జీల ప్రతిపాదనలపై ఈనెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణా మండలి (ఏపీఈఆర్సీ) వర్చువల్ పద్ధతిలో నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీ.వీ నాగార్జునరెడ్డి తెలిపారు. ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్ మూడు విద్యుత్తు పంపిణీ సంస్థలకు సంబంధించిన అధికారులు విశాఖపట్నం నుంచే పాల్గొంటారన్నారు. ఏపీఈఆర్సీ ఆధ్వర్యంలో మంగళవారం నమూనా ప్రజాభిప్రాయ సేకరణ (మాక్ డ్రిల్) కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిస్కమ్ ల సిఎండిలకు సూచించారు. ఎక్కువ మంది వినియోగదారులు పాల్గొనేలా విద్యుత్తు సిబ్బందితో ప్రచారం చేయాలన్నారు. సర్కిల్, డివిజన్ కార్యాలయాల నుంచి వినియోగదారులు/ అభ్యంతరదారులు తమ సలహాలు/ సూచనలు/ అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గత రెండేళ్ల తరహాలోనే ఈ ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలోని సమీప విద్యుత్ ఆపరేషన్ సర్కిల్ కార్యాలయం(ఎస్ఈ ఆఫీస్) లేదా డివిజన్ కార్యాలయాల (ఈఈ ఆఫీస్) నుంచి ఎక్కడి నుంచైనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభిప్రాయాలను తెలపొచ్చని సూచించారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా https://ncubestreamings.com/apercpublichearing వెబ్ లింక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. నమూనా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తో పాటు సభ్యులు ఠాకూర్ రాంసింగ్, సెక్రటరీ కె రాజబాపయ్య, సీపీడీసీఎల్ సిఎండి జె పద్మ జనార్దన్ రెడ్డి, ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ సిఎండి కె సంతోషరావు, మూడు విద్యుత్ పంపిణీ సంస్థల డైరెక్టర్లు, సూపరింటెండెండింగ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.