కడియపులంక కుర్రాడి బొంగు చికెన్‌కు జాతీయ స్థాయి మూడో బహుమతి
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుపున తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక యువకుడు కర్రి ప్రదీప్ బృందం తయారు చేసిన బొంగు చికెన్ కు జాతీయ స్థాయి మూడవ బహుమతి దక్కింది. 26వ జాతీయ యువజన వారోత్సవాలు కర్ణాటకలోని హుబ్బళి జిల్లా దురవాడలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ నెల 12 నుండి 16 వరకు వారం రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల తో పాటు వేలాది మంది పాల్గొనగా, ఈ వేడుకల్లో ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సాహస కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. కాగా జాతీయ సమగ్రతను పెంపొందీంచడానికి ఏర్పాటుచేసిన ఫుడ్ ఫెస్టివల్ లో అఖిల భారత స్థాయిలో మూడవ బహుమతి మన రాష్ట్రానికి లభించింది.కడియపులంకకు చెందిన శ్రీ ప్రగతి విద్యానికేతన్ అధినేత కర్రి యోహాన్ తనయుడు ప్రదీప్ బృందం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి మన రాష్ట్రం తరఫున పాల్గొనగా వారు తయారుచేసిన బొంగు చికెన్ కు ఈ అరుదైన అవకాశం లభించింది. మొదటి బహుమతి హిమాచల్ కు, రెండోవ బహుమతి కేరళకు వచ్చాయి.