వందేభారత్ రైలులో ఇక ఆరున్నర గంటల్లోనే…
రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు
- విశాఖకు రెండున్నర గంటలే…
- మొదలైన వందేభారత్ రైలు ప్రయాణాలు
- ఢిల్లీ నుంచి వర్చువల్ విgధానంలో ప్రారంభించిన ప్రధాని మోదీ
- సికింద్రాబాద్ లో పాల్గొన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్,పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి
- అందుబాటులో ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ టిక్కెట్లు
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య కేంద్రం రాజమహేంద్రవరం నుంచి సికింద్రాబాద్ కు రైలు ప్రయాణ సమయం ఇకపై ఆరున్నర గంటలే… అలాగే ఆంధ్రా పారిశ్రామిక కేంద్రం విశాఖపట్నం రెండున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. వందేభారత్ హైస్పీడు రైలు సేవలు ఆదివారం నుంచి ప్రారంభం కావడంతో ఇప్పటివరకూ ఉన్న సూపర్ ఫాస్ట్ రైళ్ల కంటే మరింత వేగంగా ప్రయాణం సాగనుంది. రాజమండ్రి స్టేషన్ కు ఉదయం 7.55 గంటలకు వచ్చే వందే భారత్ రైలు మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరే రైలు రాత్రి 8.58 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది.
అలాగే రాజమండ్రిలో రాత్రి 8.58కి బయలుదేరే వందేభారత్ రైలు రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరే వందేభారత్ రైలు 7.55 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులు వందేభారత్ రైలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది.
విశాఖ-సికింద్రాబాద్ (20833) – సికింద్రాబాద్ – విశాఖ (20834) వందేభారత్ రైలు ప్రయాణ వేళలు:
విశాఖ: 5.45 సికింద్రాబాద్:15.00
రాజమండ్రి: 7.55 వరంగల్ :16.35
విజయవాడ:10.00 ఖమ్మం :17.45
ఖమ్మం :11.00 విజయవాడ :19.00
వరంగల్ :12.05 రాజమండ్రి :20.58
సికింద్రాబాద్:14.15 విశాఖ :2330
రాజమండ్రి నుంచి ప్రయాణ ఛార్జీలు ఇలా…
వందేభారత్ రైలులో ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ అనే రెండు రకాల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి ఛైర్ కార్ టిక్కెట్ ఛార్జీ రూ.1,365 కాగా, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ టిక్కెట్ ఛార్జీ రూ.2,485
విశాఖపట్నం నుంచి రాజమండ్రికి ఛైర్ కార్ టిక్కెట్ ఛార్జీ రూ.625 కాగా, ఎగ్జిక్యూటవ్ ఛైర్ కార్ టిక్కెట్ ఛార్జీ రూ.1215.
విశాఖ-రాజమండ్రి -రూ.625 – రూ.1,215
విశాఖ-విజయవాడ -రూ.960 – రూ.1,825
విశాఖ-ఖమ్మం -రూ.1,115 – రూ.2,130
విశాఖ-వరంగల్ -రూ.1,310 – రూ.2,540
విశాఖ-సికింద్రాబాద్ -రూ.1,720 – రూ.3,170
సికింద్రాబాద్-వరంగల్ -రూ.520 – రూ.1,005
సికింద్రాబాద్-ఖమ్మం – రూ.750 – రూ.1,460
సికింద్రాబాద్-విజయవాడ – రూ.905 – రూ.1,775
సికింద్రాబాద్-రాజమండ్రి – రూ.1,365 – రూ.2,485
సికింద్రాబాద్ – విశాఖ – రూ.1,665 – రూ.3,120
ఆంధ్రప్రదేశ్ లో 3 – తెలంగాణలో 3 హాల్టులు
సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తున్న వందే భారత్ రైలుకు ఆంధ్రపదేశ్ లో 3 హాల్టులు, తెలంగాణ లో 3 హాల్టులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విశాఖపట్నంలో బయలు దేరే రైలు రాజమండ్రి, విజయవాడ స్టేషన్లలో ఆగుతుంది. ఆ తర్వాత తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో హాల్టులతో సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైలు సైతం ఇవే హాల్టులతో విశాఖపట్నం చేరుతుంది.తొలి పూర్తి దేశీయ హైస్పీడ్ రైలు వందే భారత్ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నడుమ పరుగులు తీయడం మొదలయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి పర్వదినాన ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో పచ్చ జెండా ఊపి వందే భారత రైలును ప్రారంభించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, తెలంగాణ మంత్రులు, రైల్వే శాఖ ఉన్నతాధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2023 కొత్ సంవత్సరంలో ప్రారంభించిన మొదటి వందే భారత్ రైలు తెలుగు ప్రజలకు ఇస్తున్న కానుక అని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.