- చివరి శ్వాస వరకూ రాజకీయాలను వదిలే ప్రసక్తేలేదు
- ఇది కళింగాంధ్ర కాదు..కలబడే ఆంధ్రా
- రాజకీయ నాయకులకు ఏమైనా కొమ్ములు ఉంటాయా?,
- గూండాలు, రౌడీలను ఎలా తన్నాలో నాకు తెలుసు
- యువతకు బంగారు భవిష్యత్ కోసం బాధ్యతగా పనిచేస్తా
- రణస్థలం జనసేన యువశక్తి సభలోజనసేన అధినేత పవన్ కల్యాణ్
కడ శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన జనసేన యువశక్తి సభలో పవన్ పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులనుద్దేశించి ఎవడ్రా మనల్ని ఆపేది అంటూ పవన్ కల్యాణ్ తన ప్రసంగం ప్రారంభించారు. ఇప్పుడున్న నాయకులు యువత గురించి ఆలోచించట్లేదని, వారి బిడ్డల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని విమర్శించారు. ప్రతి వెధవతో, ప్రతి సన్నాసితో మాట అనిపించుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు అనిపించుకోకుండా బతికేయగలనని, అయితే ప్రజల పక్షాన నిలబడి తిట్టించుకోవడం గెలుపుగానే భావిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాల్లో ఉంటే ఈ వెధవలే వచ్చి మరీ ఫొటోలు దిగుతారని అన్నారు. పేదలు, సామాజిక బాధ్యతే తనకు ముఖ్యమన్నారు. ఈ రాజకీయ నాయకులు ఏమైనా దిగొచ్చారా? అని ప్రశ్నించారు. ‘‘ రాజకీయ నాయకులు ఒకటంటే..మనమూ అనగలం. రాజకీయ నేతలకు ఎంత హక్కు ఉందో.. మనకూ అంతే ఉంది. ఇది కళింగాంధ్ర కాదు..కలబడే ఆంధ్రా. రాజకీయ నాయకులకు ఏమైనా కొమ్ములు ఉంటాయా?, వాళ్లను నిలదీయాలంటే ఎందుకంత భయం?. వెధవలను, సన్నాసులను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. గూండాలు, రౌడీలను ఎలా తన్నాలో కూడా నాకు తెలుసు’’ అని పవన్ హెచ్చరించారు. ఓటమిని గాయంగా భావించానే తప్ప పరాజయంగా కాదని, తన చివరి శ్వాస వరకూ రాజకీయాలను వదిలే ప్రసక్తే లేదని పవన్ స్పష్టం చేశారు. రణస్థలం లో జనసేన యువశక్తి సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
యువత భవిత కోసమే
యువత కు బంగారు భవిష్యత్ కోసం బాధ్యతగా పనిచేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాగ్దానం చేశారు. యువతకు మంచి భవిష్యత్ కోసమే తన పోరాటమన్నారు. ఒక దేశపు సంపద నదులు, ఖనిజాలు కాదని, ఒక దేశపు సంపద యువత కలల ఖనిజాలు అని పవన్ స్పష్టం చేశారు. తనకూ సగటు మనిషి ఆలోచనే ఉందని, చేతికి చేతికర్ర కావాల్సిన రోజు వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుందన్నారు. వయస్సు పెరుగుతూ వచ్చినప్పుడు భావితరం విలువ తెలుస్తుందని పవన్ తెలిపారు. ఎవరినో తిట్టడానికి ఈ సభ పెట్టలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇతరుల కోసం జీవించడాన్నే తాను ఆనందంగా భావిస్తానని పవన్ అన్నారు.
3 ముక్కల ప్రభుత్వం..3 ముక్కల సీఎం
సినిమాల విజయం ద్వారా ఆనందం కలగలేదని, సామాన్యుల కష్టం తనను సంతోషంగా ఉండనివ్వలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ‘యువశక్తి’ సభలో ఆయన మాట్లాడారు. ‘‘నాకు ప్రజా పోరాటమే తెలుసు. పార్టీని నడిపేంత డబ్బు వస్తే సినిమాలు వదిలేందుకు సిద్ధం. రాష్ట్రమంతా సమస్యలమయం. పూర్తికాని పోలవరం.. ఉద్యోగులకు అందని జీతాలు.. బూతులు తిట్టే మంత్రులు. అసలే విభజన జరిగిన రాష్ట్రాన్ని మళ్లీ ముక్కలు చేసే కుట్ర చేస్తున్నారు. ఇది 3 ముక్కల ప్రభుత్వం..తను 3 ముక్కల సీఎం’’ అని పవన్ విమర్శించారు.
మహా అయితే నా ప్రాణం పోతుంది
సినిమాలు చేస్తున్నప్పటికీ తన మనసు కష్టాల్లో ఉన్న ప్రజల గురించే ఆలోచిస్తోందని పవన్ కళ్యాణ్ రణస్థలంలో అన్నారు. ‘నా కోసం తొలిప్రేమ, ఖుషి సినిమాల వరకే పోరాటం చేశా. నాకు పిరికితనం చిరాకు. సత్యాన్ని, సాహసాన్నే నమ్ముకున్నా. మహా అయితే ఏమవుతుంది.. నా ప్రాణం పోతుంది. నేను గెలుస్తానో, ఓడిపోతానో తెలీదు. పోరాటం చేయడం ఒకటే తెలుసు. గూండాగాళ్లను, వెధవలను ఎలా తన్నాలో నాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడు కానీ డబ్బుకు లొంగడు : యువశక్తి సభలో హైపర్ ఆది
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన యువశక్తి సభకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభావేదికపై గిరిజన స్త్రీలు థింసా నృత్యాన్ని ప్రదర్శించగా, పవన్ కల్యాణ్ ఆసక్తిగా తిలకించారు. ఓ దశలో ఆయన గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యంలో కాలు కదిపారు. కాగా ఈ యువశక్తి సభకు పవన్ కల్యాణ్ వీరాభిమాని హైపర్ ఆది కూడా హాజరయ్యారు. తనదైనశైలిలో పంచ్ లు వేస్తూ వేదికపై ఉన్న పవన్ కల్యాణ్ ను కూడా నవ్వించారు. ఏపీ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ ను తిట్టే శాఖ కూడా పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ఆ శాఖ పెట్టుకుని అదే పనిగా తిట్టుకోండి… శాఖల పరువు తీస్తున్నారు..మీ శాఖల గురించి పది నిమిషాలు చెప్పమంటే మీరు పదో సెకనులోనే దొరికిపోతారు అంటూ విమర్శించారు. “వారాహి బండిని అడ్డుకుంటారా? ఆయనకు తిక్కరేగితే పాదయాత్ర చేస్తారు.. అప్పుడు మీరు కాశీయాత్రకు పోవాల్సిందే. పవన్ కల్యాణ్ జనాల పక్షాన ఉన్నాడు కాబట్టే జనసేనాని అయ్యాడు. ఈ మధ్య ప్యాకేజీ అంటున్నారు…పవన్ కల్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడే తప్ప…. ప్యాకేజీకి కాదురా….!. ఇంకా దత్తపుత్రుడు అంటున్నారు… మీరు ఏ నోటితో అయితే దత్తపుత్రుడు అన్నారో అదే నోటితో అంజనీపుత్రుడు అనిపించుకుంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పవన్ కల్యాణ్ ను ఏదో ఒక మాట అనేసి పాప్యులర్ అయిపోవాలనుకునేవాడే. మీ పాప్యులారిటీ కోసం ఆయన పర్సనాలిటీ దెబ్బతినేలా మాట్లాడితే ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తొస్తాడు అన్నారు.
ఒక్కడి నిజాయతీని తట్టుకోలేక 151 మంది భయపడిపోతున్నారు .నిలకడలేని రాజకీయం అంటున్నారు…మీరేమో వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేయొచ్చా? వ్యాపారాలు ఏమీ లేని ఆయన సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా? టేబుల్ పై భారతదేశం బొమ్మ పెట్టుకుని, టేబుల్ కింద చేయిచాచే మీది నిలకడలేని రాజకీయం..అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అమ్మనాబూతులు తిట్టే మీది నిలకడలేని రాజకీయం. ఒక్కడి నిజాయతీని తట్టుకోలేక 151 మంది భయపడిపోతున్నారు…అదేనా మీ రాజకీయం? పవన్ ది నిలకడలేని రాజకీయం కాదు, నికార్సయిన రాజకీయం. పవన్ పై కుల ముద్ర వేస్తున్నారన్నారు.