సంపూర్ణ అభివృద్ధి ప్రణాళిక తో రండి అని ఆర్ట్ అఫ్ లివింగ్ ప్రతినిధులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా
శ్రీశైలం పుణ్య క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అకుంఠిత దీక్షా దక్షతలతో శ్రమిస్తున్నారు.పవిత్ర శ్రీశైలం పరిసరాలను ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, తిరుమలకి మించిన టెంపుల్ సిటీ గా తీర్చిదిద్ది హైందవ ధర్మాన్ని దశ దిశల్లో పరిఢవిల్లె చర్యలు చేపడుతున్నారు.అందులో భాగంగా ఈ రోజు శ్రీశైలం లో ఆర్ట్ అఫ్ లివింగ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ సుమారు 2017లో ప్రఖ్యాత ధార్మిక సంస్థ ఆర్ట్ అఫ్ లివింగ్ కు శ్రీశైలం లో 22 ఎకరాల స్థలం కేటాయించారు.అయితే సరియైన నిర్మాణ ప్రణాళిక, అందుకు తగిన అనుమతులు రాకపోవడం తో ఇంతవరకూ ఆ స్థలం లో వారు ఎలాంటి అభివృద్ధి పనులు చెయ్యలేక పోయారు. మరోవైపు జగద్గురు పీఠం కోసం ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించిన సంగతి విదితమే.ఈ పీఠం వారు తమ ప్రణాళికలో పేర్కొన్న విధంగా భక్తులకు ఉచిత వసతి, కళాశాల, ఆసుపత్రి నిర్మించడానికి పూజాది కార్యక్రమాలు ప్రారంభించారు.ఇదే నేపథ్యంలో ఆర్ట్ అఫ్ లివింగ్ వారు వారికి ఇచ్చిన స్థలంలో ఎలాంటి అభివృద్ధి చేయదల్చుకున్నదీ తెలుపాలని కోరుతూ ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించారు.
హిందూ సంస్కృతి గొప్పదనం చాటేలా ఈ స్థలం లో ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించాలని సూచించారు.
నల్లమల అటవీ ప్రాంతం వనమూలికలకు పుట్టినిల్లు వంటిది అని, ఒక ఆయుర్వేద ఆసుపత్రి దానికి అనుబంధం గా ఒక ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ నిర్మిస్తే దేశానికి ఎంతో ఉపయోగం అని చెప్పారు.స్పష్టమైన, సంపూర్ణమైన అభివృద్ధి ప్రణాళిక తో పాటు, ఎంత కాలం లో ఆ ప్రణాళిక అమలు పరుస్తారో సిద్ధం చేస్తే తాను సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.