కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూల్లోనే ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు.
కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కృష్ణానదీ పరివాహక ప్రాంతానికి ఏమాత్రం సంబంధంలేని విశాఖపట్నంలో ఏర్పాటు చేయటం సరైనది కాదు. బోర్డు కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేఖ రాసింది. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని 2021లోనే ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక ఏకగ్రీవ తీర్మానం చేయటం గమనార్హం.
కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులు వూకదంపుడు ఉపన్యాసాలు, ప్రకటనలు చేశారు. కానీ హైకోర్టు అమరావతి లోని కొనసాగుతుందని ఇటీవల సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వ ద్వంద వైఖరి బహిర్గతమవుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏపీ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి కొరవడింది. రాష్ట్ర అభివృద్ధిని అంధకారంలోకి నెడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఈనెల 11న జరగనున్న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశంలో బోర్డు కార్యాలయాన్ని కర్నూలుకు తరలిస్తూ సానుకూల నిర్ణయం తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించాలని కోరుతున్నాం.