- కొంతమూరు-గాడాల రహదారిలో యువ సునామీ
- ఖేలో రాజానగరం’లో వాలీబాల్ పోటీలు ప్రారంభం
రాజమహేంద్రవరం: సంక్రాంతి పర్వదినాల్లో యువతను సాంప్రదాయ క్రీడల వైపు మళ్లించడంలో భాగంగా ఖేలో రాజానగరంలో భాగంగా నిర్వహిస్తున్న జక్కంపూడి మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ ఆదివారం సాయంత్రం అదరహో అన్న రీతిలో ప్రారంభమయ్యింది. కోరుకొండ మండలం గాడాల గ్రామంలో వాలీబాల్ పోటీలతో ఈ మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ కు తెరలేచింది. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు, వైసీపీ యువ నాయకుడు జక్కంపూడి గణేష్ ఈ మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ నిర్వహణకు నడుంబిగించారు.ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి బూడి మత్యాలనాయుడు, శాప్ ఛైర్మన్ బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టుకు ఆదివారం సాయంత్రం భారీ వాహనాలతో ఘన స్వాగతం పలికారు. వైసీపీ యువ నేత జక్కంపూడి గణేష్ నేతృత్వం యువకులు కొంతమూరు-గాడాల రహదారిపై దాదాపు యువ సునామీ సృష్టించారు. గణేష్ అభిమానులు వేల సంఖ్యలో తరలిరావడంతో కొంతమూరు బ్రడ్జి వద్ద నుండి గాడాల వైపు వెళ్లే నాలుగు లేన్ల రహదారి కిక్కిరిసిపోయింది.
యువతలో దాగివున్న ప్రతిభను వెలికి తీయడానికే…
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని యువకుల్లో దాగివున్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి తమ్ముడు గణేఅ్ సారధ్యంలో ఈ మెగా క్రీడా ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నామని కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఏక కాలంలో నియోజకవర్గంలోని మూడు మండలాల్లో వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
జక్కంపూడి కుటుంబంతో 30 ఏళ్ల అనుబంధం-ముత్యాలనాయుడు
దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు కుటుంబంతో తనకు 30 ఏళ్ల నుండి అనుబంధం ఉందని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆణిముత్యం రాజా ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. రాముడికి లక్ష్మణుడి తరహాలో రాజాకు ఆయన సోదరుడు గణేష్ సహకరిస్తూ, ఇలాంటి మెగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖేలో రాజానగరంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
వంద పార్టీలు కలిసినా జగన్ ను ఏమీ చేయలేరు:బైర్రెడ్డి
మార్పు కోసం, మంచి చేయడానికి ముందుకు వెళుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎదుర్కోనే ధైర్యం లేక విపక్షాలు పొత్తులకు దిగుతున్నాయని శాప్ ఛైర్మన్ బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. వంద పార్టీలు కలిసినా, వెయ్యిమంది కలిసినా, వంద మీడియా సంస్థలు కలిసి తప్పుడు ప్రచారం చేసినా, వేల కోట్లు ఖర్చుచేసినా జగన్ రెడ్డిని ఏమీ చేయలేరన్నారు. ఈ రోజు ఒక నాయకుడు చంద్రబాబును కలిశారని, తాను ఎటువంటి అవినీతి చేయలేదని సదరు నేత చెప్పుకుంటున్నారని, అయితే దొంగతనం చేసేవాడికి మద్దతిచ్చేవాడిని ఏమంటారని ప్రశ్నింఛారు. రాజు ఎవరో రాక్షసుడెవరో ఆలోచించుకుని ప్రజలంతా నాయకుడికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
జనగన్న కోసం పనిచేయడానికి ఒక ప్రైవేటు సైన్యమే ఉందని, ఆయన కనుసైగ చేస్తే చాలు విపక్షాలను ఎదుర్కోవడానికి తామే సరిపోతామన్నారు, మార్పు తీసుకొస్తున్న జగన్నకు రక్షణ కవచంగా నిలవాలని యువతకు పిలుపునిచ్చారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా, వైసీపీ యువజన విభాగం అధ్యక్షునిగా, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అయిన జక్కంపూడి రాజా తమకు రోల్ మోడల్ అని సిద్ధార్థ రెడ్డి ప్రశంసించారు. తనలాంటి ఎంతో మంది యువకులను రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారన్నారు. బీసీలను, పేదలను, ఎస్సీలను, ఎస్టీలను కూడా నాయకులుగా మార్చారన్నారు. జక్కంపూడి గణేష్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ను గుర్తించే గోదావరి జిల్లాలకు వైసీపీ యువజన విభాగానికి కో-ఆర్డినేటర్ గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించారని సిద్ధార్థరెడ్డి తెలిపారు.
బాబా సాహెచ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ కు అంకితం
బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ కు ఈ క్రీడా ఫెస్టివల్ ను అంకితమిస్తున్నామని వైసీపీ యువ నేత జక్కంపూడి గణేష్ ప్రకటించారు.బహుమతులు గెల్చుకోవడానికి కాక క్రీడాస్ఫూర్తితో మనసులు గెలవడమే ధ్యేయంగా క్రీడాకారులు తమ ప్రతిభను చాటాలని కోరారు. ఈ ఫెస్టివల్ కు అయిన వ్యయ ప్రయాసలతో జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించవచ్చని, అయితే రాజానగరం నియోజకవర్గంలోని క్రీడాకారులను ప్రోత్సహించి, వారిలోని ప్రతిభను వెలికి తీయాలనే ధ్యేయంతో నియోజకవర్గ స్థాయిలో మాత్రమే నిర్వహిస్తున్నామన్నారు. మహమ్మారి కోవిడ్ సమయంలో నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాలు నిర్వహించామని, ఇప్పుడు యువతలో క్రీడా నైపుణ్యం వెలికి తీయడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రాజానగరం నియోజకవర్గం నుండి ఒక విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, పీవీ సింధు వంటి అగ్రశ్రేణి క్రీడాకారులు తయారవ్వాలని గణేష్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రుడా ఛైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు తదితరులు పాల్గొన్నారు.