- తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో టిడిపి ఆవిర్భావం
- పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి …
- 1983 జనవరిలో సీఎంగా మొదటిసారి ప్రమాణస్వీకారం
- ప్రమాణ స్వీకరోత్సవంలోనూ తనదైన మార్క్ చాటిన ఎన్టీఆర్
- ఎల్బీ స్టేడియంలో అచ్చ తెలుగులో ప్రమాణస్వీకారం
సరిగ్గా నలభై ఏళ్ల క్రితం ఇదే రోజు.. అంటే 1983 జనవరి 9న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు మూడు దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వ పునాదులు కూల్చేసి… తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన రోజది. 1983 జనవరి 5న జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు జనవరి 9, నాలుగు దశాబ్దాల నాటి చరిత్ర ఇది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఢిల్లీ పెత్తనం, సీల్డు కవర్ రాజకీయాలు నడుస్తున్న టైంలో … రాజకీయాల్లో మార్పే లక్ష్యంగా, తెలుగువాడి ఆత్మగౌరవమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి, ప్రజలందరికీ చేరువయ్యారు.
ఫలితంగా ఆవిర్భవించిన 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో నేటికీ ఏ పార్టీకీ సాధ్యం కానంతగా 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రతి అడుగూ రాజకీయాల్లో పెను సంచలనమే. నందమూరి తారక రామారావు మొదటి సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసింది 1983 జనవరి 9న.. అంటే నాలుగు దశాబ్దాల క్రితం ఇదే సమయంలో .. ఎన్నికల ప్రచారంలోనే కాదు.. ఘన విజయం సాధించాక ప్రమాణస్వీకారోత్సవంలోనూ ఎన్టీఆర్ విలక్షణతను చాటారు.
రాజ్‌భవన్‌లో కొద్ది మంది ఆహూతుల సమక్షంలోనే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే పాతపద్ధతిని పక్కకునెట్టారు. తనను ఎంతగానో ఆదరించి, గుండెల్లో గుడికట్టి ఆరాధించిన అభిమానులు, అశేష ప్రజానీకం మధ్య లాల్‌బహదూర్ స్టేడియంలో అచ్చతెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడి నుంచి పేదలు, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అయన పాలన సాగించారు .
ఎన్టీఆర్ ఆరు పదుల వయసులో ప్రాంతీయ పార్టీని స్థాపించి… ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీపై అఖండ మెజార్టీ సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెత్తందారీ రాజకీయాలు కొనసాగేవి. భూస్వాములు, మోతుబరులు, కొన్ని సామాజికవర్గాల చేతుల్లోనే రాజకీయం ఉండేది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో తప్ప మిగతా స్థానాల్లో దాదాపుగా వారే పోటీ చేసేవారు. వెనుకబడిన వర్గాలకు నామమాత్రపు ప్రాధాన్యమే దక్కేది. ఢిల్లీలో రిమోట్ కంట్రోల్ పెట్టుకుని, ఇక్కడి నాయకుల్ని, ముఖ్యమంత్రుల్ని తోలుబొమ్మల్లా ఆడించేవారు. ముఖ్యమంత్రులైనా, ఎంత కొమ్ములు తిరిగిన నాయకులైనా.. ఇందిర ముందు సాగిలపడాల్సిందే.
ఢిల్లీ పెద్దల దయాదాక్షిణ్యాల మీదే ముఖ్యమంత్రుల భవిష్యత్తు ఆధారపడి ఉండేది. పట్టుమని రెండేళ్లు కూడా గడవకుండానే ముఖ్యమంత్రుల్ని మార్చేసేవారు. అప్పట్లో కేవలం ఇందిరాగాంధీ కుమారుడి హోదాలో హైదరాబాద్‌కు వచ్చిన రాజీవ్‌గాంధీ.. ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించిన తీరు రాష్ట్ర ప్రజలందర్నీ నొచ్చుకునేలా చేసింది…. రాజకీయాల్లో ప్రవేశించి, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్న ఎన్టీఆర్ సంకల్పాన్ని ఆ ఘటనే ప్రేరేపించిందంటారు. తెలుగువారికి సొంత గుర్తింపు తేవాలన్న పట్టుదలతో, తెలుగు ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి అదే నాంది పలికింది. అలా ఆవిర్భవించిన తెలుగుదేశం.. దేశ రాజకీయాల్లోనే పెనుసంచలనాలు సృష్టించింది.