కందుకూరు తొక్కిసలాట ఉదంతం రాజకీయ రచ్చగా మారటంతో.. దీనికి కారణమని ఆరోపిస్తూ ఇంటూరు సోదరులు ఇంటూరు నాగేశ్వరరావు, రాజేష్ లను పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి కందుకూరుకు వారిని అర్థరాత్రి దాటిన తర్వాత తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలో హైటెన్షన్ చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఇంటూరు బ్రదర్స్ కు బెయిలు మంజూరవ్వడం టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపగా వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం కనిపిస్తోందంటున్నారు.
టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రోడ్ షో సందర్భంగా కందుకూరులో జరిగిన తొక్కిసిలాట ఘటన ఎంత కలకలం రేపిందో తెలిసిందే. దానికి చంద్రబాబు ప్రచార పిచ్చే కారణమని నానా హడావుడి చేసింది వైసీపీ సర్కారు.
దాదాపు అర్థరాత్రి 2.30 గంటల వేళలో టీడీపీ అధిష్ఠానం పంపిన హైకోర్టు న్యాయవాదులు క్రిష్ణారెడ్డి, కిషోర్, నరేంద్రబాబు, పాండురంగారావులతో పాటు మరికొందరు కందుకూరు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. చర్చల అనంతరం వారిని స్టేషన్ లోపలకు అనుమతించారు. అనంతరం ఇంటూరు సోదరుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి..ఆ పై న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపర్చారు.
తెల్లవారుజామున మొదలైన వాదనలు ఉదయం ఐదు గంటల వరకు సాగాయి. న్యాయమూర్తి ఇంటి బయట పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. వర్గాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ఇంటూరు సోదరులకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవటంతో టీడీపీ వర్గాలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశాయి.