రాబోయే కాలం ఐటి రంగానికి గడ్డు కాలమే – సత్య నాదెళ్ల
టెక్ రంగం రాబోయే రెండు ఏళ్ళు తీవ్ర సవాళ్లు ఎదుర్కోక తప్పదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సంచలన ప్రకటన చేశారు.
ఈ సవాళ్లకు ప్రధాన కారణం ప్రపంచంలోని కీలక మార్కెట్లు అన్ని మాంద్యంలోకి వెళ్ళటమే అన్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ ట్రెండ్ మరో రెండేళ్లు కొనసాగే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో సత్య నాదెళ్ల ప్రకటన పెద్ద సంచలనమే అని చెప్పుకోవచ్చు. అయితే రెండేళ్ల బాధ తర్వాత ఐటి సెక్టార్ అసాధారణ ప్రగతి సాధిస్తుంది అని అయన వెల్లడించారు. కరోనా సమయంలో పలు కంపెనీలు పెద్ద ఎత్తున కొత్త ఉద్యోగులను తీసుకున్నాయి.
కానీ ట్రెండ్ మారిపోవడంతో వీళ్లపై వేటు పడింది. ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది కాలంలో లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. ఇదిలా ఉంటే ఐటి రంగంలోని ప్రముఖ సంస్థ సేల్స్ ఫోర్స్ తమ సిబ్బందిలో 10 శాతం మందిని తొలగించనుందనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆ కంపెనీలో 80 వేల మందికి పైగా పని చేస్తున్నారు. అంటే ఇందులో 8000 మంది ఉద్యోగాలు పోయే పరిస్థితి. సత్య నాదెళ్ల మాటల ప్రకారం చూస్తే ఒక్క సేల్స్ ఫోర్స్ మాత్రమే కాదు టెక్ రంగంలోని కీలక సంస్థలు వచ్చే రెండేళ్లలో ఇలా సిబ్బందికి కోత పెడుతూ ముందుకు సాగుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ ప్రకటన తరువాత టెక్కీస్ ఆందోళన మరింత పెరిగిందని సోషల్ మీడియా వేదికగా డిస్కషన్స్ కొనసాగుతున్నాయి…