తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతామని చెబుతున్న బీజేపీ.. ఇప్పుడు ఏపీపైనా దృష్టి పెట్టింది. ఏపీ లో వచ్చే ఎన్నికల్లో కాకపోయినా.. తర్వాత వచ్చే ఎన్నికల్లో అయినా.. పార్టీకి పట్టు పెంచుకుని.. అధికారం లోకి రావాలనేది కమల నాథుల వ్యూహంగా కనిపిస్తోంది. ఆ క్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ కీలక నాయకుడు అమిత్ షా ఏపీలో పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
కొత్త సంవత్సరం తొలి వారంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఏపీ పర్యటన పెట్టుకున్నారు. అయితే అనివార్య కారణాలతో ఇది వాయిదా పడింది. దీంతో ఈ పర్యటన రెండోవారంలో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏపీలో అమిత్ షా ఏం చేయనున్నారనేది ఆసక్తిగా మారింది. పార్టీ నేతలకు భవిష్యత్తు వ్యూహాలపై దిశానిర్దేశం చేయడం ఆయన కీలకంగా భావిస్తున్నారంట. ఈ నెల 8న ఏపీకి వచ్చే ఆయన రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.తొలుత కర్నూలు జిల్లాకు చేరుకునే అమిత్ షా.. అక్కడ పార్టీ నేతలతో భేటీ అవుతారు. రాష్ట్రంలో ఎలా ముందుకు సాగాలనే విషయంపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలతోనూ ఆయన సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సత్యసాయి జిల్లాకు చేరుకుని, అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ కూడా పార్టీనేతలతో భేటీ అవుతారు. సత్యసాయి సమాధిని దర్శించుకుంటారు.ఈ క్రమంలో ఏపీలో బీజేపీ అనుసరించే వ్యూహంపై షా.. ఒక రోడ్ మ్యాప్‌ను పార్టీ నాయకులకు అందిస్తారని తెలుస్తోంది. ప్రధానంగా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదన్న ఊహాగానాల నేపథ్యంలో షా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక షా పర్యటనలో ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే ఏపీలో బీజేపీ జనసేనతో పొత్తు కొనసాగిస్తోంది. బిజేపీ నేతలు పదేపదే పవన్ కళ్యాన్ తమకు ఆప్తుడని ప్రకటిస్తున్నారు. అయితే జనసేన మాత్రం వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై మాట్లాడటం లేదు. ఇక వచ్చే సారి టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తారు అనేది షా చెప్పనున్నట్టు తెలుస్తోంది.
మూడురాజధానుల విషయంలో అమిత్‌షాఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు రాజధానుల అంశంపైబీజేపీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే ఆ పార్టీ అమరావతికే అనుకూలంగా ఉన్నట్లు ఫీలర్లు వదులుతోంది. గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు రైతులు పాదయాత్ర చేసినప్పుడు.. దానిలో పాల్గొనాలని షా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. దీనిని బట్టి అమరావతికే బీజేపీ కట్టుబడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షా ఇప్పుడు ఏం చెబుతారనేది ఆసక్తి రేపుతోంది.
అలాగే వచ్చేఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు ఏం చేయాలనే విషయంపైనా అమిత్ షా ఏపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనే వ్యూహాన్ని ఆయన ప్రకటించనున్నట్లు చెప్తున్నారు. మరి చూడాలి ఇంత చేసినప్పటికీ బీజేపీ ఏపీలో ఏ మాత్రం సత్తా చాటుకుంటుందో ?