గంటా శ్రీనివాసరావు విలక్షమైన రాజకీయవేత్త … ఒకసారి విజయం సాధించిన నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీచేసే అలవాటు ఆయనకు లేదు. గెలిచిన సెగ్మెంట్‌లో ప్రజలకే కాదు.. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలకు కూడా ఆయన అందుబాటులో ఉండరంటారు. అలాంటాయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో? అనేది రాజకీయ వర్గాల్లో నలుగుతున్న చర్చ… ఇంతకీ గంటా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి?
తెలుగుదేశం పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి గెలుపొందారు గంటా శ్రీనివాసరావు. వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరాక గంటా ఎక్కడున్నారో టీడీపీ అధినేతకు కూడా సమాచారం లేదు. ఏనాడూ అధినేతను కలిసే ప్రయత్నం చేయలేదు. ఆయన తరఫున నియోజకవర్గంలో ఒకరిద్దరు పనులు చక్కబెడుతుంటారు. మూడున్నర సంవత్సరాల నుంచి దాగుడు మూతలాడుతున్న గంటా రాజకీయానికి ఒక స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోందిప్పుడు.
తాను ఏ పార్టీలో కొనసాగబోతున్నానో నూతన సంవత్సరం సందర్భంగా స్పష్టతనిచ్చారు గంటా. వైసీపీలోకి వెళ్తారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ, గెలిచే పార్టీలోనే, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పార్టీలోనే ఉంటారనే టాక్ గంటా మీద ఉంది. తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యంలోకి, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ నుంచి మళ్లీ తెలుగుదేశం లోకి వచ్చారు. తాజాగా ఆయన వైసీపీలో చేరతారంటూ వార్తలు వచ్చాయికానీ ఆయన ఖండించే ప్రయత్నం చేయలేదు. దీంతో జగన్ ను కలిసి పార్టీ మారడమే తరువాయి అన్న ప్రచారం జరిగింది. వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా డిసెంబరు 26వ తేదీన విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమం వెనక గంటా ఉన్నారనేది బహిరంగ రహస్యం. పార్టీలు మారే విషయంలో వ్యతిరేకత పెరుగుతుండటంతో కాపు నాయకుడిగా రూపాంతరం చెందుతున్నట్లు కనిపిస్తున్నారాయన.
రానున్న ఎన్నికల్లో అనకాపల్లి, భీమిలి, చోడవరం నియోజకవర్గాల్లో ఒకదాన్నుంచి పోటీచేయాలనే యోచనలో ఉన్నారంట. ఈ మూడింటిలో ఆయన భీమిలీని ఫైనల్ చేసే అవకాశం ఉందని గంటా సన్నిహితులు చెబుతుంటారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గంటా విడుదల చేసిన గ్రీటింగ్ కార్డుమీద చంద్రబాబు ఫొటోను ”ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ ప్రజలందరికీ 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు” అని ముద్రించారు.
కార్డుకు కుడివైపున పై భాగంలో చంద్రబాబు ఫొటోను ముద్రించారు. దీన్నిబట్టి టీడీపీలోనే గంటా కొనసాగాలనుకుంటున్నారని, చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజల స్పందన కూడా ఆయన్ను పునరాలోచనలో పడేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా గంటా స్ట్రాటజీలు ఎవరికీ అంతుపట్టవంటారు. మరి వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఏ ఒడ్డున ఉంటారో చూడాలి.