రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో వైఎస్సార్ సీపీ సహా అన్ని పార్టీలకు వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకష్ణారెడ్డి స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నాం కదా అని మా వరకు పరిమితులు, మిగిలిన వారికి మరో రకంగా చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో వైఎస్సార్‌సీపీకి మినహాయింపు ఉంటుందేమోనని ఎవరూ వర్రీ కావాల్సిన పని లేదని చెప్పారు. ఈ ప్రభుత్వానికి అన్నింటికంటే.. ప్రజల ప్రాణాలే ముఖ్యం అని అన్నారు.
జీవో విడుదలకు టీడీపీ వైఖరే కారణం…
ఈ జీవో తీసుకురావడానికి కారణం టీడీపీ వైఖరేనన్నారు. రేపు ఈ జీవోను ఉల్లంఘించి, సభలు నిర్వహిస్తే తర్వాత పరిణామాలను వారే ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అసలు గుంటూరు ఈవెంట్ ప్లానింగే సరిగా లేదని, ఇచ్చిందేమో చెత్త సరుకు .అదీ …రెండొందలో, మూడొందలో విలువ చేసేవి, కానుకల పంపిణీ పేరిట అమాయక పేద మహిళలను తీసుకొచ్చి, ఆ తర్వాత బాధ్యతా రాహిత్యంగా ఈ దుర్ఘటన నుంచి టీడీపీ తప్పుకోవడం కాని…ఇవన్నీ ఆ పార్టీ నైజాన్ని చాటుతున్నాయని సజ్జల ఎద్దేవా చేశారు. పైగా టీడీపీ సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని సజ్జల విమర్శించారు.
ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చు…
లోకేశ్ పాదయాత్ర గానీ, లేదా ఆయన తండ్రి బాబు యాత్రకు గానీ, పవన్ కళ్యాణ్ బస్సు యాత్రలకు కాని తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ యాత్రలకు వెళ్లే ముందు ఆలోచించాల్సిన విషయమేమంటే…గతంలో తాము ఏ రకంగా రాష్ట్రానికి, ప్రజలకు అన్యాయం చేశామో, రేపు ఏ రకంగా న్యాయం చేస్తామో చెప్పగలగాలని శ్రీ సజ్జల హితవు పలికారు. అదేవిధంగా తాను గతంలో టీడీపీని ఎందుకు ప్రశ్నించలేదో, ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తున్నాడో పవన్‌కళ్యాణ్ తన యాత్రలో చెప్పగలగాలని ఆయన సూచించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేలా ఏడాదిన్నరలో వచ్చే ఎన్నికలకు టీడీపీ, జనసేనలు సిద్ధం కావాలనే తమ పార్టీ ఆశిస్తోందన్నారు
తమ సభలను పబ్లిక్ స్థలాల్లో కాకుండా, గ్రౌండ్లను ఎంపిక చేసుకోవాలని పార్టీలకు సూచిస్తున్నామే తప్ప మీటింగులు వద్దని తామేమీ ఆంక్షలు విధించడం లేదని సజ్జల తెలిపారు. పబ్లిక్ స్థలాల్లో మీటింగులు వద్దని చెప్పడం అధర్మం కాదన్నారు. దురాలోచనలు ఉన్నప్పుడు, విమర్శలతో దాడి చేయాలనుకున్నప్పుడు, కుట్రపూరితంగా వారి మనస్సులు ఉన్నప్పుడు విధానంలో లోపాలను ఎలాగైనా ఎంచవచ్చని చంద్రబాబును విమర్శించారు.
బాబుకు మృతులపై కనీసం సానుభూతి లేదు…
బాబు గుంటూరు సభకు హాజరై వెళ్లిపోయిన తర్వాత దుర్ఘటన జరిగి ముగ్గురు పేద మహిళళు మరణించారు. బాబు, తనకుతాను విమానంలో హైదరాబాద్ వెళ్లిపోయాడు. తన దారిన తాను వెళ్లిన తర్వాత అమాయకుల ప్రాణాలు పోయాయన్న జాలి లేదు. దుర్ఘటనా స్థలానికి ఎందుకు వెనక్కి రాలేదో బాబు వివరణ ఇవ్వకపోవడాన్ని సజ్జల ప్రశ్నించారు.
రాజకీయాల్లో ఆరోగ్యకర పోటీని ఆహ్వానిస్తాం…
ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలూ పోటీలో ఉండడం ఆరోగ్యదాయకమేనని, బీఆర్‌ఎస్ పోటీకి వస్తే ఆహ్వానిస్తామని శ్రీ సజ్జల స్వాగతించారు. జగన్‌మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నది ధర్మయుద్ధం అని మరోసారి చెప్పారు. రాజకీయాల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని జగన్ గారు కోరుకుంటున్నారని తెలిపారు.