Contents
ఎలక్టోరల్ బాండ్స్..
దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాటికి ఎన్నికల సమయంలో భారీగా నిధులు అవసరం ఉంటుంది. అందుకే విరాళాల సేకరణకు ప్రధాన రాజకీయ పార్టీలు బాండ్లను జారీ చేస్తుంటాయి. అయితే ఈ సారి గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల జారీకి కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్లను విక్రయించనుంది. మెుత్తం 29 శాఖల్లో ఇవి అందుబాటులోకి ఉంటాయి.
గతంలో బాండ్ల జారీ..
హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 12న, గుజరాత్లో డిసెంబర్ 1, 5 తేదీల్లో పోలింగ్ ఉంది. అంతకుముందు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 10 వరకు 22వ దశలో, ఈ ఏడాది జూలై 1 నుంచి 10 వరకు 21వ దశలో బాండ్లను విక్రయించారు. మార్చి 1 నుంచి 10, 2018 వరకు దేశంలో తొలిసారిగా ఎన్నికల బాండ్లను విక్రయించారు. గత లోక్సభ ఎన్నికల్లో కనీసం 1 శాతం ఓట్లు పొందిన రాజకీయ పార్టీలు మాత్రమే బాండ్ల ద్వారా గ్రాంట్లు పొందేందుకు అర్హులని గమనించాలి. తాజా జారీలో లక్నో, సిమ్లా, డెహ్రాడూన్, కోల్కతా, గౌహతి, చెన్నై, పాట్నా, న్యూఢిల్లీ, చండీగఢ్, శ్రీనగర్, గాంధీనగర్, భోపాల్, రాయ్పూర్, ముంబై ఎస్బీఐ శాఖల్లో బాండ్ల విక్రయం జరుగుతుంది.
బాండ్ల కొనుగోలు..
రూ.1000, 10,000, 1,00,000, 10,00,000, 1,00,00,000 డినామినేషన్లలో ఈ బాండ్ల అమ్మకం ఉంటుంది. సాధారణంగా ఈ బాండ్లు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో 10 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. అదే సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం అదనంగా 30 రోజులు అనుమతినిస్తుంది. విదేశాల్లో రాజకీయ పార్టీలు ఎలాంటి విరాళాలు స్వీకరించకూడదనే పరిమితి కూడా ఉంది.
బీజేపీ తొలిసారిగా..
2017 సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని పార్లమెంటులో మనీ బిల్లుగా ఆమోదించింది. దీని ద్వారా రాజకీయ పార్టీలకు కోట్లాది రూపాయలు సమకూరినప్పటికీ అవి ఎవరు ఇచ్చారనే విషయం మాత్రం బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఈ డబ్బుకు ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉండటం విశేషం.
ఇవి ఎవరికి లాభం..?
విరాళాలను ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచారని, ఇది నల్లధనం చలామణిని ప్రోత్సహిస్తున్నదని దేశంలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దేశంలోని కార్పొరేట్ సంస్థలు తమ గుర్తింపును వెల్లడించకుండా రాజకీయ పార్టీలకు డబ్బును విరాళంగా అందించడానికి ఈ స్కీమ్ రూపొందించబడింది. ఇది అధికార పార్టీకి విరాళాలు ఎక్కువగా రావడానికి వేసిన ప్లాన్ అనే ఆరోపణలు ఉన్నాయి. అంటే రాజకీయ పార్టీలకు విరాళాలు అందించాలని అనుకునేవారు ఈ మార్గాన్ని వినియోగించుకోవచ్చు.