news Telugu News

ఆంధ్రప్రదేశ్: కరోనా సమయంలో పిల్లలను స్కూలుకు పంపించడం తల్లిదండ్రులందరికీ అంగీకారమేనా?

utf-c2fc96d7

ఆంధ్రప్రదేశ్‌లో బడికి హాజరయ్యే విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి అంగీకారపత్రం తేవాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ చెబుతోంది.

‘మా అంగీకారంతోనే పిల్లలను బడికి పంపిస్తున్నాం’ అనే పత్రం పేరెంట్స్ నుంచి తప్పనిసరి అంటోంది. అయితే, ఈ పత్రాలలో ‘కరోనా సమయంలో మా పిల్లలను పాఠశాలకు పంపించడం మాకు అంగీకారం కాదు’ అనే ఆప్షన్ మాత్రం ఇవ్వలేదు.

అంగీకార పత్రంలో రెండో ఆప్షన్ ఎందుకు పెట్టలేదు…?

ఏపీలో నవంబర్ 2 నుంచి ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతులకు.. అలాగే జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ క్లాసులూ ప్రారంభమయ్యాయి.

కరోనా కారణంగా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. కరోనా ఉద్ధృతి కాస్త తగ్గడంతో తగిన జాగ్రత్తలు తీసుకుని విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలనే నిర్ణయాన్ని తీసుకున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాఠశాలలను ప్రారంభించే సందర్భంలో చెప్పారు.

విద్యార్థుల తల్లిదండ్రులు… ‘మా పిల్లలను పాఠశాలకు పంపించడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అన్న అంగీకార పత్రం మీద తప్పక సంతకం చేయాలి.

అయితే ఈ పత్రంలో ‘మాకు అంగీకారం కాదు’ అని చెప్పే అవకాశం లేదు.

మా పిల్లలకు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిది..?
‘ఆపరేషన్ ఎంత చిన్నదైనా సరే పేషెంట్‌ని థియేటర్‌లోకి తీసుకెళ్లడానికి ముందు ”అనుకోనిది ఏదైనా జరిగితే మాకు ఎలాంటి సంబంధం లేదు” అన్న హామీ పత్రాన్ని తీసుకుంటారు. అంగీకార పత్రాలమీద సంతకాలు తీసుకుంటున్న ఏపీ విద్యాశాఖ తీరు కూడా అలాగే ఉంది’ అని విశాఖలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని తండ్రి పి.ఆనంద్ కుమార్ ‘బీబీసీ’తో అన్నారు.

“మీ పిల్లలను స్కూల్ కి పంపించడం వల్ల ఎలాంటి నష్టం జరగదు. కరోనా నివారణ చర్యలు అన్నీ మేం తీసుకున్నాం. ఒక వేళ మీ పిల్లలకు స్కూల్ కి రావడం వల్లే కరోనా సోకితే ఆ బాధ్యత మాది. వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాం” అని ఆయా పాఠశాలలు కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు హామీపత్రాలు ఇస్తే బాగుంటుంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పాఠశాలల పరిసరాలు బాగానే ఉంటున్నాయి. కానీ అందరూ ఒకే చోటుకి చేరడం, దాదాపు క్లోజ్డ్ రూమ్స్‌లా ఉండే తరగతి గదుల్లో గంటల తరబడి ఉండటం ఈ సమయంలో అంత మంచిది కాదని నా అభిప్రాయం. నేను నా పిల్లలను పాఠశాలకి పంపించను. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత… లేదా పాఠశాలలు తీసుకున్న చర్యలు కరోనాని నియంత్రిస్తాయన్న నమ్మకం వచ్చాకే పంపుతా. పోతే విద్యాసంవత్సరం పోతుంది. పిల్లలకి అనారోగ్యం రాకుండా ఉంటే అదే చాలు”అని చెప్పారు ఆనంద్ కుమార్.

ఎటూ తేల్చుకోలేకపోతున్న తల్లిదండ్రులు
“మా పిల్లల చదువు, ఆరోగ్యం రెండూ ముఖ్యమే. అలాగని కరోనా సమయంలో పిల్లలను బడులకు పంపించలేం. దీని వల్ల చదువులో వెనకబడిపోతారన్న ఆందోళన ఉంది. పాఠశాలకు పంపించిన తర్వాత పిల్లలకు కరోనా సోకితే వారి ప్రాణాలను పణంగా పెట్టినవారమవుతాం. ఈ సందర్భంలో ఏం చేయాలో తెలియడం లేదు. స్కూల్‌కి పంపించడం ఎవరికి ఇష్టం? ఎంత మందికి ఇష్టం లేదు…? అని తల్లిదండ్రుల అందరి అభిప్రాయాలను తీసుకుని… దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది” అని పదోతరగతికి చదువుతున్న సాయిసౌమ్య తల్లి లంకా సునీత బీబీసీతో చెప్పారు.

ఈ విషయంపై ఏపీ విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేపు చినవీరభద్రుడు బీబీసీతో మాట్లాడుతూ.. “పంపించడం ఇష్టమే అని అంగీకరిస్తున్నవారిని మినహాయిస్తే మిగతావారికి పంపించడం ఇష్టం లేదనే అర్థం. మళ్లీ ప్రత్యేకంగా ఆప్షన్ ఎందుకు? అయినప్పటికీ ఆలోచన బాగుంది. అంగీకార పత్రంలో రెండు అప్షన్లు ఉంటే మంచిదే. దాని వల్ల పంపేవారు, పంపేందుకు ఇష్టం లేని వారి సంఖ్య కచ్చితంగా తెలుస్తుంది. ఆ సంఖ్యలు కూడా కరోనా సమయంలో తదుపరి కార్యచరణకి అవసరమవుతాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దీనిపై పునరాలోచన చేస్తాం” అన్నారు.

జాగ్రత్తలు తీసుకుంటున్నాం
రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో తరగతులకు హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తప్పనిసరి. బడులు తెరిచిన రోజున హాజరు శాతం కాస్త తక్కువే నమోదైనా తర్వాతి రెండు రోజులూ క్రమక్రమంగా పెరిగింది. అయితే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు చేయించిన కరోనా పరీక్షల ఫలితాల్లో పాజిటివ్ కేసులు తేలడంతో మళ్లీ హాజరు శాతం తగ్గింది. ప్రస్తుతానికి 35 నుంచి 40 శాతం మంది విద్యార్థులు హాజరవుతున్నారని విద్యాశాఖ తెలిపింది.

విశాఖపట్నం డీఈవో లింగేశ్వరరెడ్డి బీబీసీతో మాట్లాడుతూ… “హాజరవుతున్న విద్యార్థులకు గేటు దగ్గరే థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ శానిటైజేషన్ తప్పనిసరి చేస్తాం. విద్యార్థులు, సిబ్బంది అన్న తేడా లేకుండా మాస్కులేనివారిని బడిలోకి అనుమతించం. దీంతోపాటు తరగతికి కేవలం 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేశాం. దీంతోపాటు ప్రభుత్వ సూచనల ప్రకారం బడికి హాజరవుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకుంటున్నాం. దీంతోపాటు తమ పిల్లలను పాఠశాలకు పంపించేందుకు ఇష్టం లేని వారి అభిప్రాయాన్నీ తీసుకోవాలని కొందరు తల్లిదండ్రులు కోరుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇదీ ఒక విధంగా మంచి విషయమే.” అని తెలిపారు.

ఇంట్లో ఉంచడం కంటే బడికి పంపించడమే మంచింది
పాఠశాలల రీఓపెన్ సందర్భంగా ఉపాద్యాయులకు, విద్యార్థులకు కరోనా పరీక్షలు చేశారు. వీటిల్లో 829 మంది ఉపాధ్యాయులు, 575 మంది విద్యార్థులకు కరోనా పాజిటీవ్ గా తేలింది. అయితే ప్రారంభించిన రోజు చేసిన పరీక్షలు కావడంతో… ఇవి పాఠశాలకు రావడం వల్ల వచ్చిన కేసులుగా పరిగణించలేమని ఉపాధ్యాయుడు పరమేశ్వర రావు చెప్పారు.

”ఈ సమయంలో ఎవరు ఏం చెప్పినా అది తప్పుగా కనిపించే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒకవైపు చదువు, మరోవైపు కరోనా భయం. అయితే కరోనా తీవ్రత కాస్త తగ్గడం, కరోనా కట్టడిమీద అవగాహన పెరగడంతో విద్యా సంవత్సరం వృథా కాకుండా తమ పిల్లలను బడికి పంపించడమే మంచిది. పిల్లలు బడికి రాకపోయినా ఆటపాటలంటూ బయటే ఉంటున్నారు. అందుకే పిల్లలను ఇంట్లో ఉంచే కంటే బడికి పంపించడమే మేలు” అని చెప్పారు.

ప్రాథమిక పాఠశాలలు తెరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో…?
ఇప్పటికే 9, 10 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారు. పాఠశాలల రీఓపెనింగ్ కి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం… నవంబర్ 23 నుంచి 6, 7, 8 తరగతులకు, డిసెంబర్ 14 నుంచి 1, 2, 3, 4, 5 తరగతులను ప్రారంభిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది.

“ప్రస్తుతానికి ఉన్నత పాఠశాలలే తెరిచారు. ప్రాథమిక పాఠశాలలను డిసెంబర్ 14 నుంచి ప్రారంభిస్తారు. అసలే చిన్నపిల్లలు…ఈ సమయంలో వీళ్లతో కష్టమే. కరోనా నిబంధనల పట్ల వాళ్లకి అంతగా అవగాహన ఉండకపోవచ్చు” అని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు లిల్లీ ఏస్తేరు రాణి బీబీసీతో అన్నారు.

రెండు ఆప్షన్లు అవసరమే..
తమ పిల్లలను పాఠశాలకు ఎందుకు పంపించడం లేదో తెలిపే అవకాశాన్ని తల్లిదండ్రలకు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి సిద్ధార్థ్ అభిప్రాయపడ్డారు.

“కరోనా క్రమంగా తగ్గుతున్నా సెకండ్ వేవ్ వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకి విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. దశల వారీగా తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేయడం లేదా ఆన్ లైన్ ద్వారా వారితో చర్చించి వారి అయిష్టతకు కారణాలు తెలుసుకోవచ్చు. అలాగే పిల్లలను పాఠశాలకు పంపడంలో వారి అయిష్టాన్ని రాతపూర్వకంగా తెలుసుకుని… దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కరోనాను నియంత్రించేందుకు తదుపరి చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే అంగీకార పత్రంలో అయిష్టతను తెలిపే అవకాశం కల్పిస్తే బాగుంటుంది” అని ఆయన అన్నారు.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment