news Telugu News

అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రాల్లో.. ఏపీ 3, తెలంగాణ 6వ స్థానం

images-3f04655e

అమరావతి

 

తెలుగు రాష్ట్రాలు రెండూ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండూ సెప్టెంబరు నెలలో 30 రోజులపాటు రిజర్వుబ్యాంకు వద్దకు స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ, వేస్‌ అండ్‌ మీన్స్‌, ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లడమే ఇందుకు నిదర్శనం.

ఆర్‌బీఐ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్‌ 30 రోజులకు స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ కింద రూ.1,182 కోట్లు వాడుకుంది.

ఆ వెసులుబాటు పూర్తయిన తర్వాత 29 రోజులపాటు వేస్‌ అండ్‌ మీన్స్‌ కింద రూ.1,939 కోట్లు తీసుకుంది.

ఆ రెండు అవకాశాలు ఆవిరైన తర్వాత 17 రోజులపాటు ఓవర్‌డ్రాఫ్ట్‌ కింద రూ.1,520 కోట్లు ఉపయోగించుకుంది.

తెలంగాణదీ అదే దారి

అప్పుల విషయంలో తెలంగాణ కూడా అదే పంథాను అనుసరించింది.

సెప్టెంబరులో 30 రోజులపాటు స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ కింద రూ.1,240 కోట్లు, వేస్‌ అండ్‌ మీన్స్‌ కింద రూ.1,576 కోట్లు, ఓవర్‌డ్రాఫ్ట్‌ కింద 21 రోజులపాటు రూ.698 కోట్లు ఉపయోగించుకుంది.

రిజర్వ్‌బ్యాంకు నుంచి ఈ సౌకర్యాలు ఉపయోగించుకోవడం ఆయా రాష్ట్రాల ఆర్థిక పెళుసుతనానికి అద్దం పడుతోంది.

జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, గోవాలాంటి చిన్నరాష్ట్రాలు ఈ మూడు వెసలుబాట్లలో ఏదో ఒక దాన్నే ఎక్కువ రోజులు ఉపయోగించుకోగా, తెలుగురాష్ట్రాలు మాత్రం మూడు సౌకర్యాలనూ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక మొత్తంలో ఉపయోగించుకున్నాయి.

దీన్ని ఉపయోగించుకున్నందుకు వడ్డీ రూపంలో కాస్త ఎక్కువగానే చెల్లించాలి.

తెలుగు రాష్ట్రాల రుణభారం ఇలా

ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు నెల వరకు బహిరంగ మార్కెట్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రూ.31,250 కోట్ల రుణం తీసుకుంది.

ఇదే సమయంలో తెలంగాణ రూ.22,961 కోట్లు సేకరించింది.

2018-19లో ఆంధ్రప్రదేశ్‌ రూ.30,200 కోట్లు రుణం తీసుకోగా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లోనే దాన్ని దాటేసింది.

2019-20లో తీసుకున్న రూ.42,415 కోట్లతో పోలిస్తే ఈ ఆరునెలల్లోనే 74% రుణం తీసుకున్నట్లయింది.

తెలంగాణ 2018-19లో రూ.26,740 కోట్లు, 2018-19లో రూ.37,109 కోట్ల రుణం తీసుకుంది.

ఈ ఏడాది తొలి ఆరునెలల్లో తీసుకున్న రుణం 2018-19లో తీసుకున్న మొత్తం రుణంలో 86% కాగా, 2019-20లో తీసుకున్న రుణంలో 61.87%.

ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ రుణ కొలమానాలు కొంత మెరుగ్గానే ఉన్నాయి.

దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.3,53,596 కోట్ల రుణం తీసుకోగా అందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా 8.83%, తెలంగాణ వాటా 6.49% మేర ఉంది.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కంటే ఎక్కువ రుణాలు తీసుకున్నది మహారాష్ట్ర, తమిళనాడు మాత్రమే.

ఈ ఏడాది ఇప్పటివరకు అప్పులపరంగా ఏపీ మూడోస్థానంలో, తెలంగాణ 6వ స్థానంలో నిలిచాయి.

About the author

Rayudu Venkateswara Rao

Leave a Comment